ఎన్నికల్లో పోటపడిన వారిలో ఒకరు ఓడిపోవడం ఒకరు గెలవడం సాధారణం. కానీ ఇక్కడ ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మూడో వ్యక్తి కూడా ఓడిపోయారు. ఆ వ్యక్తి ఎవరో కాదు ఓటరు. అంగబలం, అధికార బలంతో ప్రత్యర్థులను నామినేషన్ వేయకుండా చేశారు. దీంతో బలవంతపు ఏకగ్రీవాలు అయ్యాయి. ముఖ్యంగా కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రక్రియ ఎక్కువ.
బలవంతపు ఏకగ్రీ ఎన్నిక అయిన అభ్యర్థులు అప్పుడే వీరతాళ్లు మెడకు వేసుకుని సామాజిక మాధ్యమాల్లో పదవీ విమానంలో విహరిస్తున్నారు. తమను నామినేషన్ వేయకుండా అడ్డుకుని గూండాయిజం చేసిన ప్రత్యర్థులకు శాపనార్థాలు పెడుతూ బూతులు తిడుతూ ఆక్రోశిస్తున్నారు. గెలిచే అవకాశమున్న అభ్యర్థులైతే మరీ నింగికెగిసేలా తిట్లదండకం అందుకున్నారు.
ఇక బలవంతపు ఏకగ్రీవాలతో పరోక్షంగా ఓటమిచెందిన ఓటరును ఎవర్ని కదిలించినా ఆవేదన కట్టలు తెగుతోంది. అందులోనూ పండుగ పూట ఎన్నికలొచ్చాయి కదా పదిరూపాయలు చేతికందుతుందని ఎన్నో కలలు గన్నారు. ఓటును అమ్ముకోకూడదు అన్ని ఎన్ని ప్రజాస్వామ్య చిలకపలుకులు పలికేవారి ఓటరు చీల్చి చెండాడుతున్నారు. ఓటుకు రెండువేలు ఇప్పుడు సాధారణమైంది. ఇంట్లో నాలుగు ఓట్లున్నా రెండు పార్టీలనుంచి 16వేలు వచ్చేంది కదా..ఇదిరాకుండా చేశారు అంటూ లబోదిబోమంటున్నారు. అల్పసంతోషులు కదా పాపం ఈ బాధ ఎలా ఉందో వాళ్లను కదిలిస్తే చాలు ఆవేశం కట్టలు దాటుతోంది.
ఓటర్లలో మందుబాబులది మరో గోల. వారం రోజులైనా మందుకు ఢోకా ఉండదనుకున్న వారి నాలుకు తీపికి చేతు మాత్ర పడింది. నాలుగు చుక్కలు పడితేగానీ రాత్రికి నిద్రపట్టని మందుబాబులు కిక్కు లేని సమయంలో కూడా ఎన్నికల గురించే తిట్టుకుంటున్నారు. నిషా లేకపోయినా వారి కోపం నషాలానికంటినట్టున్నారు.
గెలిచిన వారు వీరతాళ్లు వేసుకుంటూండగా నామినేషన్ల ప్రక్రియ అద్భుతంగా జరిగిందని కడప కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ వేనోళ్ల పొగిడింది. వాస్తవానికి కడపలో మెజారిటీ మున్సిపాలిటీలు బలవంతపు ఏకగ్రీవాలుగా మారి గొడవలు, ఆర్తనాదాలు, గాయాలు అన్నీ ఇక్కడే జరిగాయి. కానీ కలెక్టర్ అదృష్టం ఇలా ఉంది మరి. మైదుకూరు ఎన్నికలు మళ్లీ జరిపిస్తున్నందుకు వీరతాడు వేసింది ఎన్నికల కమిషన్.
ఉన్నదున్నట్టు చెప్పిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కొసమెరుపు అయ్యారు. మీకు దూము తగల (రాయలసీమ యాసలో మీకు రోగం రాను) అంటూ వాస్తవం చెప్పారు. పండుగ పూట ఓటర్లను పస్తులు పెట్టారు గదరా అంటూ నిజాలు మాట్లాడటం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నిజమే కదా మరి..అల్పసంతోషులకు ఆనందం వచ్చినా నష్టం జరిగినా తట్టుకోలేరు. ఒప్పని మొగుడికి తలంబ్రాలు పోసినట్టు ఈ బలవంతపు ఏకగ్రీవాలు అందరినీ ఆక్రోశానికి గురి చేశాయి కదా!
బలవంతపు ఏకగ్రీవాల వెనుక..
